Amazon Order: 2 లక్షల ఫోన్ ఆర్డర్ పెడితే.. నెత్తి పగలగొట్టుకునేందుకు 'రాయి' పంపిన అమెజాన్..!
Amazon Order: If you place a phone order for 2 lakhs.. Amazon sent a 'stone' to break your skull..!

దీపావళి సందర్భంగా బెంగళూరు టెక్నీషియన్‌కు ఎదురైన అనుభవం చూస్తే షాక్ కాకుండా ఉండలేరు. దాదాపు రెండు లక్షల రూపాయల స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి (టైల్ ఆకారంలో ఉండే) వచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా రూ.1.87 లక్షల విలువచేసే తనకెంతో ఇష్టమైన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమానంద్. దీపావళి నాటికి ఫోన్ తన చేతిలో ఉండేలా అక్టోబర్ 14న అమెజాన్ యాప్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం ఆర్డర్ పెట్టాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. తన కొత్త ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూశాడు అయితే తనకు వచ్చిన పార్శిల్‌లో ఫోన్‌రాలేదు సరికదా రాయి వచ్చింది. అయితే అదృష్టం ఏమిటంటే అక్టోబర్ 19న డెలివరీ అయిన సీల్డ్ ప్యాకేజీని అన్‌బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు. దీంతో అమెజాన్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించింది.
అలాగే దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు. తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. FIR నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. "నేను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ నాకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. అమెజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ అనుభవం తీవ్ర నిరాశపరిచింది" అని ప్రేమానంద్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.










