'"'If you die'.. : 'మీరు చనిపోతే''.. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు సమాచారమిచ్చే యాప్..!
చైనాలో ఈ కొత్త యాప్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

మొబైల్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్తయాప్ సంచలనం సృష్ఠిస్తోంది. చైనాలో దీనిని లాంచ్ చేశారు యువ టెకీలు. "Are You Dead?, "మీరు చనిపోయారా?" అని మొబైల్‌లోని ఆ యాప్ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? (చైనీస్ భాషలో 'సిలే మే') అనే ఈ యాప్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్‌లో పెయిడ్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఒంటరిగా ఉంటున్నవారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని దీనిని రూపొందించిన టెకీలు చెప్తున్నారు. మీరు ప్రాణాలతో ఉన్నారని ధృవీకరించడానికి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ యాప్‌ను ఓపెన్ చేసి చెక్ చేయాలి. ఒకవేళ యూజర్ వరుసగా రెండు రోజులు యాప్‌ను చెక్ చేయడంలో విఫలమైతే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ యూజర్ ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్ అంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ పంపిస్తుంది.
అయితే ఈ యాప్ ఎందుకు చైనాలో ఇప్పుడు ట్రెండింగ్ అయిందంటే.. ఆ దేశంలో దాదాపు 12.5 కోట్ల మంది ఒంటరిగా నివసిస్తున్నారు. నగరాల్లో ఉద్యోగాలు చేసే యువకులు, వృద్ధులు తాము ఒంటరిగా ఇంట్లో చనిపోతే ఎవరికీ తెలియదేమో అన్న ఆందోళనలో ఉంటున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఇది తొలుత ఉచితంగా ప్రవేశపెట్టినప్పటికీ ఆ తర్వాత దీనిని పెయిండ్ యాప్ కిందకు మార్చారు. ఒంటరిగా ఉంటున్నవారు తమ ఇళ్లలో చనిపోతే చాలా రోజుల తర్వాత కానీ తెలియడం లేదు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు రెండు రోజులకు ఒక సారి ఇది అడిగే ప్రశ్నకు సమాధానం ఇస్తే మాత్రం గమ్మున ఉంటుంది. సమాధానం రాకపోతే ఎమర్జెన్సీ కాంటాక్టుల్లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు లేదా స్నేహితులకు ఈమెయిల్ పంపిస్తుంది. అయితే 2030 నాటికి చైనాలో ఒంటరిగా ఉండేవారి సంఖ్య 20 కోట్లకు చేరుతుందని అంచనా.


