మునగ సాగు.. ఎకరానికి రూ.4 లక్షల ఆదాయం..! ఈ రైతు స్టోరీ ఓ ఇన్స్‌ప్రేషన్‌..!

క‌ర్నాట‌క‌కు చెందిన ఉమేష్‌రావు మునగ సాగుతో భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు. తన తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2010 నుంచి ఈ వ్యక్తి మునగ పంట సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు. తన చిన్న వ‌య‌సులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్య‌వ‌సాయం చేయాలని నిర్ణ‌యించుకున్నాడు. తొలుత చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక లాభం లేదనుకుని మునగ పంట సాగు గురించి తెలుసుకున్నాడు. 2010లో దీనిని ప్రారంభించాడు. దాదాపు 900 మొక్కలు నాటాడు. మొదట్లో మునక్కాయలను, క్రమంగా మునగాకు పౌడర్‌ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడికి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌ కనుగుణంగా సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.

అయితే ఈ క్రమంలో ఉమేష్‌కు అనుకోని దెబ్బ ఎదురైంది. భూమి విషయంలో కుటుంబంలో వివాదం చెలరేగింది. దీంతో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్‌లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు తీసుకున్నాడు. అక్కడ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. తొలుత చిన్నమొత్తంలో, కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సార‌వంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసుకున్నాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది. వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం చేయ‌డంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్‌ను అధ్యయనం చేసి మంచి ఓడీసీ-3 వెరైటీకి చెందిన మొక్క‌ల‌ను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఉమేష్‌ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్‌ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. పలు ఫార్మా, ఇతర కంపెనీలు, ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీంతో ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు.

Updated On
ehatv

ehatv

Next Story