Why should we put up gobbillas on the occasion of Sankranti festival..!

సంక్రాంతి పండగ సందర్భంగా గొబ్బిళ్ళను ఎందుకు పెట్టాలి..!, ఎలా పెట్టాలి, దాని వలన ఎలాంటి లాభాలు అని పొందవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ రావడానికి నెల రోజులు ముందే అంటే ధనుర్మాసం ప్రారంభంలోనే గొబ్బిళ్ళను పెడతారు.

రంగురంగులతో ముగ్గులు వేసి వాటిపై గొబ్బిళ్ళు పెట్టి గొబ్బెమ్మ మీద నవ ధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి, రంగు రంగుల పువ్వుల రేకులు గుమ్మడి, బంతి, చామంతి పూలతో అందంగా వాటిని అలంకరిస్తారు. పసుపు, కుంకుమలతో గౌరీదేవిని పెట్టి పూజలు చేస్తారు. భోగినాడు సాయంత్రం కన్నెపిల్లలు గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడుతారు.

గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టె పెద్ద గొబ్బెమ్మ గోదా దేవికి సంకేతం. ఆవుని గౌరీ మాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తు తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.

గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.

ఎప్పుడు గొబ్బిళ్లు పెట్టుకోవాలి?

సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాడు అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా గొబ్బిళ్ళను పెట్టుకోవచ్చు. ఈరోజుల్లో చాలా మంది నెల రోజులు పాటు ఇలా చేయలేమని.. పండుగకు నాలుగైదు రోజులు ముందు నుంచి గొబ్బెళ్లను పెట్టడం మొదలుపెట్టారు. కానీ నిజానికి 30 రోజులు పాటు కూడా గొబ్బెమ్మలు పెట్టి రోజూ పూజలు చేయవచ్చు.

గొబ్బిళ్ళను పెట్టడం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. గొబ్బెమ్మలని పెట్టడం వలన సూక్ష్మ క్రమంలో ఇంట్లోకి రావు. వాతావరణం లో వచ్చే మార్పులకి అనుగుణంగా మనం భోగి మంటని వేస్తాము. దుఃఖ కాలం అయిపోయిందని రాబోయే రోజులు మంచివేనని భోగి మంటలు వేస్తాము.

ఆ రోజుతో ఇబ్బందులన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో కొత్త పంటలతో కొత్త అల్లుళ్లతో సంతోషంగా గడపాలని ఇలా భోగి మంట వేసి పాత సామాన్లు వంటివి కాలుస్తూ ఉంటాము. ధనుర్మాసం మొదలు భోగి వరకు మనం పెట్టిన గొబ్బెమ్మలను పిడకల కింద చేసి ఆ మంటల్లో వేస్తాము.

గొబ్బిళ్ళ పూజ ఎలా చేయాలి?

ఆవు పేడతో ఐదు ముద్దలు చేసి, ఒక పీట మీద నాలుగు వైపులా నాలుగు మధ్యలో ఒకటి పెట్టాలి. వీటి కంటే చిన్నవి ఇంకో ఐదు ముద్దలు చేసి పెద్దవాని పైన పెట్టాలి. తర్వాత ఇంకో చిన్న ముద్ద చేసి మధ్యలో ఉన్న ముద్ద పైన పెట్టాలి. ఈ మొత్తం కలిపి పదకొండు గొబ్బెమ్మలు అవుతాయి.

వాటిపై బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. పసుపు, కుంకుమ, గుమ్మడి, బంతి, చామంతి మొదలైన పూలతో వీటిని అలంకరించాలి. ఆ పీటని ఇంటి బయట పెట్టి పిల్లల్ని నాలుగువైపులా కూర్చోబెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి అష్టోత్తరంతో పూజలు చేయాలి.

కొబ్బరికాయ, పండ్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు తిరుగుతూ భజన చేయాలి. కోలాటం కూడా చేయొచ్చు. కృష్ణుని మీద పాటలు, గొబ్బెమ్మ పాటలు, దేవతామూర్తులు పాటలు పాడుతూ ఆనందంగా పిల్లలు గడుపుతారు.

శాస్త్రీయ కారణం ఏమిటంటే..

గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆవుపేడలో యాంటీ బయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు.

Updated On
ehatv

ehatv

Next Story