Mallojula Venugopal Rao : మల్లోజుల వేణుగోపాలరావు.. విప్లవోద్యమాల నుంచి లొంగుబాటు వరకు..!
మల్లోజుల వేణుగోపాలరావు అభయ్ అలియాస్ భూపతి అలియాస్ సోను, వివేక్ , రాజన్, మాస్టర్ అనే అలియాస్‌లతో పిలవబడే మావోయిస్ట్ నాయకుడు.

మల్లోజుల వేణుగోపాలరావు అభయ్ అలియాస్ భూపతి అలియాస్ సోను, వివేక్ , రాజన్, మాస్టర్ అనే అలియాస్‌లతో పిలవబడే మావోయిస్ట్ నాయకుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పాలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు, పార్టీ అధికారిక ప్రతినిధి, సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీ. కిషెంజీ అంటే మల్లోజుల కోటేశ్వరరావు చిన్న సోదరుడిగా 40 సంవత్సరాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్‌గా పనిచేసి, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గెరిల్లా కార్యకలాపాలు నడిపాడు.
1956 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మల్లోజుల వెంకటయ్య, తల్లి మధురమ్మ ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. తండ్రి 1997లో, తల్లి 2022లో మరణించారు. ముగ్గురు సోదరుల్లో చిన్నవాడు. పెద్ద సోదరుడు అంజన్న, మరో సోదరుడు కోటేశ్వరరావు (కిషెంజీ). 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా, బురిషోల అడవుల్లో సెక్యూరిటీ ఫోర్సెస్‌తో ఎన్‌కౌంటర్‌లో కోటేశ్వరరావు మరణించాడు.
మల్లోజల 1981లో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరు నాగారం దళంలో సభ్యుడిగా చేరారు, 1982 లో మహదేవపూర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏడాదికి మళ్ళీ అడవిబాట పట్టారు. మల్లోజల మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 1993 లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అయ్యారు. 1995 లో కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. ఇక 2007 లో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. మల్లోజల పార్టీలో అభయ, సోను, భూపతి, వివేక్ పేర్లతో వ్యవహరించారు. ఈ 35 సంవత్సరాల పాటు కూడా తెలంగాణలో చాలా తక్కువగా పని చేశారు. ఆయన ఎక్కువ కాలం మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో పని చేశారు ఆయనతో పాటుగా మొత్తం 60 సభ్యులు మందులతో ఉన్నటువంటి మావోయిస్టు బృందం ఆయన వెంట ఉన్నారు. దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను విస్తరించాడు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత అతను సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశాడు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణా భాద్యతలను స్వీకరించాడు. ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటన లో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక ఇతని హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అతని తలపై భారీ మొత్తాలను ప్రకటించారు. కిషన్‌జీ మరణం తరువాత అతనిని పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరితుతున్న లాల్‌గర్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు.
విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ ఆయన లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్యే విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పోలీసులకు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఇతనిపై రూ.6 కోట్ల రివార్డ్, 100కుపైగా కేసులు ఉన్నాయి.
