గడచిన రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను ఒక సెలబ్రిటీ వివాదం కుదిపేస్తున్నది.

గడచిన రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను ఒక సెలబ్రిటీ వివాదం కుదిపేస్తున్నది. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కుటుంబంలో వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు కు, ఆయన కుమారుడికి మధ్య గొడవలు రచ్చ కెక్కాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు ఒక మీడియా ఛానల్ రిపోర్టర్ రంజిత్(Journalist Ranjith) పై దాడికి దిగాడు. మోహన్ బాబు చేసిన ఈ దుశ్చర్యలను ఎవరూ ఒప్పుకోరు. ఆయన ప్రవర్తన అలా ఉంది. జర్నలిస్టు పై మోహన్ బాబు లాంటి వ్యక్తి దాడికి దిగడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. రంజిత్ చాలా సౌమ్యుడు. ఎవరితోనూ గొడవ పడడు. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసే రకం కాదు. మీ వెర్షన్ చెప్పండి అని మోహన్ బాబు ను అడగడమే రంజిత్ చేసిన పాపం. ఈ మాత్రం దానికి మోహన్ బాబు మైక్ లాక్కొని రంజిత్ పై దాడి చేయడం ఘోరం. మోహన్ బాబు చేసిన ఈ పనికి ఆయనను అరెస్టు చేయాలి. ఆయనకు కచ్చితంగా శిక్ష పడాలి. శిక్షకు ఆయన అర్హుడు. మోహన్ బాబు చేసిన ఈ పనిని ఎవరూ సమర్థించరు. సభ్య సమాజం దీనిని హర్షించదు. మోహన్ బాబు హద్దు మీరారు. కానీ మనం పరిధిలో ఉన్నామా? ఇప్పుడు ఈ మాట కొంత కటువుగా ఉన్నప్పటికీ ఇది నిజం. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉన్న మాట నిజం. మన స్వేచ్ఛ అవతలి వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి. చాలా సందర్భాలలో మీడియా పై దాడులు జరిగాయి. అప్పుడు ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. ఒక అక్రమాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో అక్రమార్కులు దాడి చేసిన సందర్భాలు ఎన్నో. రాజకీయ పార్టీల విషయం లోనూ, రాజకీయ నేతల విషయం లోనూ ఇలాంటివి జరిగాయి. కానీ వ్యక్తిగత గొడవల అంశం లో జర్నలిస్టు లపై దాడులు జరగడం చాలా అరుదు. అసలు అలాంటి చోటుకు జర్నలిస్టులు వెళ్ళలా అన్నది ఆలోచించుకోవాలి. సెలబ్రెటీల ఇంట్లో ఏదైనా జరిగితే కచ్చితంగా అది వార్తే. కవర్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఉంటుంది.


Updated On
ehatv

ehatv

Next Story