ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కాకినాడ పోర్టును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) బలవంతంగా రాయించేసుకున్నారంటూ కాకినాడ పోర్టు యజమాని కె.వి.రావు(KV Rao) సీఐడీ(CID)కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మరుక్షణం నుంచే సీఐడీ చాలా యాక్టివ్‌గా పని చేస్తూ వస్తున్నది. ఈ కేసుతో సంబంధం ఉందంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చింది సీఐడీ. మిగతా వారిపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ విచారణతో ఈ పోర్టును ఏ విధంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎక్కువ షేర్లు రాయించుకున్నారన్నది సీఐడీ తేలుస్తుంది. కాకినాడ పోర్టు(Kakinada Port)కు సంబంధించిన తేనెతుట్టెను కదిపింది మాత్రం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan). పవన్ కల్యాణ్‌ కాకినాడ వెళ్లారు. అక్రమంగా బియ్యం విదేశాలకు వెళుతున్నదని బోటును తనిఖీ చేశారు. తనను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే కామెంట్‌ కూడా చేశారు. అక్రమంగా తరలివెళుతున్న బియ్యం వ్యవహారంపై కాకుండా పోర్టుపై దృష్టి పెట్టింది. పోర్టును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అక్రమంగా రాయించుకున్నారంటూ కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడం వెనుక ఎవరున్నారన్నది రాజకీయాల పట్ల కొంచెం అవగాహన ఉన్నవారికి కూడా అర్థమవుతుంది. కేవీరావుకు కాకినాడ పోర్టును కట్టబెట్టడంపైన అప్పట్లో పవన్‌కల్యాణ్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 1996-97 ప్రాంతంలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాకినాడ పోర్టును కేవీ రావుకు ఎందుకు కట్టబెట్టారు? అంటూ పవన్‌ ప్రశ్నించారు. కేవీ రావుకు కాకినాడ పోర్టును కట్టబెట్టడం ద్వారా ఏం ఉపాధి లభించిందని నిలదీశారు. ప్రైవేటు వ్యక్తికి పోర్టును ఎలా కట్టబెడతారంటూ గట్టిగానే అడిగారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టులను అదానీ కంపెనీకి కట్టబెట్టినట్టుగా టీడీపీ మీడియా రాసుకుంటూ వచ్చింది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టు గురించి మాట్లాడటం మానేశారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్ ఏం కోరుకుంటున్నారు? కాకినాడ పోర్టుకు వచ్చినప్పుడు పవన్‌ కల్యాన్‌ బియ్యం గురించి కాకుండా ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెప్పారు. ఉగ్రవాదులు ఎవరైనా వస్తే ఏమిటి పరిస్థితి అని ప్రశ్నించారు. మందు గుండు సామాగ్రి వస్తే ఎలా? అంటూ పవన ప్రశ్నలు లేవనెత్తారు. పవన్‌ రైజ్‌ చేసిన ప్రశ్నలు సహేతుకమైనవే! ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది.



Updated On 8 Dec 2024 8:30 AM GMT
ehatv

ehatv

Next Story