రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చాలా మంది భావించారు. తెలంగాణ ఏం కోరుకుంటుంది? ఆంధ్రప్రదేశ్‌ ఏం ఆశిస్తుంది? అన్న అంశాలకు సంబంధించి మీడియాలో బోల్డన్ని కథనాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోర్టులలో, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో భాగం కావాలని తెలంగాణ సర్కారు కోరింది. విభజన సమయంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇప్పుడా ఏడు మండలాలు తిరిగి ఇచ్చేయాలంటూ తెలంగాణ సర్కార్‌ కోరుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏం కోరుకుంటున్నదన్నదాంట్లో మాత్రం క్లారిటీ కనిపించలేదు. ఇక విద్యుత్‌ బకాయిల అంశం కావచ్చు, నీటి కేటాయింపుల అంశం కావచ్చు వీటికో సామరస్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు అధికారుల స్థాయిలో ఒక కమిటీ వేయాలంటూ ఉభయ ముఖ్యమంత్రులు తీర్మానం చేసుకున్నారు. ఇక ఆ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(chandrababu) నాయుడు తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పునరుత్తేజం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. ఆ విధంగా తాను పని చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ గడ్డపై టీడీపీ మళ్లీ వికసించబోతున్నదంటూ చంద్రబాబు చెప్పారు. కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తానంటూ ప్రకటించారు. ఇక నుంచి తెలంగాణ నాయకత్వానికి తరచూ సమయం కేటాయిస్తానని మాట ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎదగడానికి అవకాశం ఉందన్నారు. ఇన్నీ చెబుతూనే తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తున్నదని కితాబిచ్చారు. ఇంతకు ముందు తెలంగాణ తెలుగుదేశంపార్టీ(TDP) నాయకులు ఎవరైనా చంద్రబాబు దగ్గరకు వెళితే రాజకీయపరమైన అంశాలను చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు ఇక్కడ పోటీ చేయాలని అనుకున్న నాయకులకు ప్రోత్సాహం ఇవ్వలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో(GHMC Elections) పోటీ చేయాలన్న తపన చంద్రబాబులో కనిపించలేదు. అలాగే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అంతే! ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకన్నారు చంద్రబాబు. అప్పుడది పెద్ద చర్చకు దారి తీసింది. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకునే సరికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చారు. ఇన్నాళ్లకు చంద్రబాబుకు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలన్న ఆలోచన కలిగింది. 2004 నుంచి 2014వరకు పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌(AP congress) ప్రభుత్వం ఉండింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఏ సభలలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పునరుత్తేజం కోసం పని చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు రేవంత్‌. సో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఏపీలో తమ తమ పార్టీలను బలోపేతం చేయడానికి సంకల్పించారన్నమాట!

Eha Tv

Eha Tv

Next Story