KCR Comments: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!
రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 'తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా.. ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే.. అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ గారి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడడం... వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం...తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ మీద ఎర్రవెల్లి నివాసంలో అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
''తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గం.. తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలి. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోడీ ల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహ లాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కాలేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలి. పంపులను ఆన్ చేయాలి. చెరు వులు కుంటలు రిజర్వాయర్లను నింపాలి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం దీని మీద పోరాటాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ, బిజెపి పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు దీనిమీద పార్టీ గట్టిగా రెండు పార్టీలను నిలదీయాలి. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బిఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా... మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలి.
తెలంగాణ ప్రజలకు ఎన్నడైనా అండగా నిలబడేది బిఆర్ఎస్ పార్టీనే'' అని ఆయన అన్నారు.